ఇందూర్, బతుకమ్మ :
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన దీక్షలో ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ బ్రిడ్జి మంజూరు కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ చేయని ప్రయత్నం లేదని, కేంద్ర ప్రభుత్వ వాటాను 25 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెంచి పూర్తి నిధులు మంజూరు చేయించారన్నారు. బ్రిడ్జి పనులు ప్రారంభమైన నాటి నుంచి గతంలో అర్వింద్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, నేడు కమీషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనులను అటకెక్కించిందని ఆరోపించారు. మాధవనగర్, అర్సపల్లి రెండు బ్రిడ్జిల నిర్మాణాల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వమే కారణమని అన్నారు. మాధవనగర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ దీక్ష చేపడితే నాపైన, పార్టీ నాయకులు పైన అక్రమ కేసులు బనాయించారని, ఇప్పటికీ తాము కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాధవనగర్ బ్రిడ్జి అడిషనల్ ప్రపోజల్ దాదాపు ₹9 కోట్ల ప్రతిపాదనలపై ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపీ అర్వింద్ కలిసి నిధుల ఫైలును ఫైనాన్స్ విభాగానికి పంపించారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆ ఫైలును ఫైనాన్స్ విభాగంలో తొక్కిపెట్టి నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మరోవైపు, 100 శాతం కేంద్ర నిధులతో చేపడుతున్న అర్సపల్లి రైల్వే బ్రిడ్జికి భూసేకరణ చేసి ఇవ్వాలని కోరుతుంటే, అర్వింద్ ధర్మపురి దీక్ష చేస్తున్నారని తెలిసిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జికి నిధులు విడుదల చేయాలని, పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాభివృద్ధి కమిటీలు, ఆటో యూనియన్లు, వర్తక-వ్యాపార సంఘాలు, కుల సంఘాల నాయకులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పెట్రోల్ పంపు యాజమాన్యాలు, వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
