బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం హంగర్గ గ్రామం లో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పరిశీలించారు. గత నాలుగు రోజులుగా పోచంపాడ్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు, ఇళ్లు, గ్రామ వీధులు మునిగిపోయిన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంగర్గతో పాటు బోధన్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయని, సుమారు 20 వేల ఎకరాల్లో 100% పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ఎకరానికి రూ.35,000 పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా వరి, సోయా, తంబాకు పంటలు ప్రతి సంవత్సరం పోచంపాడ్ బ్యాక్ వాటర్ వల్ల నష్టపోతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ గళం ఎత్తి రైతుల పక్షాన బలంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఈసారి కూడా నష్టపరిహారం రాకపోతే ఇక ఎప్పటికీ రాదన్న ఆవేదన వ్యక్తం చేస్తూ, రైతుల తరఫున బీజేపీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ లకు అతీతంగా కూడా రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రజల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించి, ఎప్పుడైనా అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కూరెళ్ల శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శులు జంగం వెంకటేష్, దొనకంటి లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు రాజురె మనోహర్, బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తికేంద్ర ఇంచార్జీలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

