27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పంచాయతీ కార్యదర్శి వేధింపులతో బిల్ కలెక్టర్ ఆత్మహత్య ?

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరుడి బాబు (38), బోధన్ మండలం పెంటకుర్ద్ గ్రామంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 5వ తేదీ ఉదయం బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11:22 గంటలకు బాబు మృతి చెందారు. మృతుడి భార్య నీరుడి కవిత ఫిర్యాదు మేరకు పెంటకుర్ద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్ గత కొంతకాలంగా తన భర్తను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేసి అప్పగించినప్పటికీ, లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఆరోపిస్తూ అందరి ముందు అవమానించారని, తన భర్త గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారని తెలిపారు. ఈ వేధింపుల కారణంగానే మనస్తాపానికి గురై తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాబు రాసిన ఆత్మహత్య లేఖ కూడా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్త మృతికి కారణమైన పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని భార్య కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారని బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ తెలియజేశారు.

More articles

Latest article