24.7 C
Hyderabad
Monday, August 3, 2026

భీంగల్ కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ) ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు.ఆర్థిక శాఖ అనుమతి మేరకు ప్రభుత్వ ఉత్తర్వు 43 తేది 27 జూన్, 2025 న్యాయశాఖ భీంగల్ లో కోర్టు ఏర్పాటు అనుమతి ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తదుపరి పరిపాలన పరమైన విధివిధానాలను రూపొందించుకోవచ్చని వివరించారు. సదరు సమాచారాన్ని నిజామాబాద్ జిల్లాజడ్జి, జిల్లా కలెక్టర్, జిల్లా ట్రెజరీ అధికారికి చేరవేశారు. భీంగల్ కోర్టు న్యాయ పరిధి… ఆర్మూర్ డివిజన్ జ్యూడిషియల్ పరిధిలో  ఒక జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జూనియర్ సివిల్ జడ్జి కోర్టు) ఉన్నది. క్రిమినల్, సివిల్ కేసులు పెరిగి పోవడంతో ఒకే కోర్టు పై పనిభారం పెరిగి పోవడం మూలంగా అదనంగా మరొక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అవసరాన్ని ఆర్మూర్ బార్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కు పలుమార్లు నివేదించింది. బార్ కృషి, పట్టుదల మేరకు 2008 సంవత్సరంలో భీంగల్ న్యాయ పరిధిని పేర్కొంటూ ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలోనే అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఏర్పాటు చేయించింది నాటి నుండి కోర్టు అధికారిక విధులు నిర్వహిస్తున్నది.ప్రస్తుతం సరళ రాణి జూనియర్ సివిల్ జడ్జిగా విధులలో ఉన్నారు.భీంగల్ కేంద్రంగా కోర్టు ఏర్పాటుకు భూమి, భవనం తదితర అంశాలు అలాగే ఉన్నాయి. భీంగల్ పట్టణంలో ఏర్పాటుకు అనుమతించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (జ్యూడిషయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు) న్యాయ పరిధిలో భీంగల్, సిరికొండ, కమ్మర్ పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఎర్గట్ల పోలీస్ స్టేషన్ లలో నమోదైన క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు న్యాయ పరమైన విచారణకు వస్తాయి. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భీంగల్ లో స్థల పరిశీలన, భవన సముదాయం నిర్మాణం తదితర అంశాలను అధ్యయనం చేసి అనుమతి మంజూరు చేస్తుంది. భీంగల్ న్యాయ పరిధిలో ప్రస్తుతం సివిల్, క్రిమినల్ కేసులు కలిపి మొత్తం వేయి వరకు ఉన్నట్లు తెలిసింది.ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విప్లవ్ కిరణ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ చాలా సంవత్సరాల శ్రమ, కృషి, వినతుల అనంతరం భీంగల్ కేంద్రంగా కోర్టు ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాని హైకోర్టు పరిశీలన అనంతరమే, అనుమతి మంజూరు చేస్తుందని తెలిపారు.సీనియర్ న్యాయవాది, ఆర్మూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎమ్. కె. నరేందర్ కోర్టు ఏర్పాటు పై తన అభిప్రాయాన్ని తెలుపుతు భీంగల్ న్యాయ పరిధిలో ఉన్న కక్షిదారులకు ఆర్మూర్ దూరం అయినందున, కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా కేసులు ఉన్నందున కోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు ఆవిరల శ్రమనోడ్చారని అన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ కోర్టు ప్రాగనంలోనే భీంగల్ న్యాయ పరిధిలోని కేసులను రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు లో న్యాయ విచారణ జరుపుతున్నారని, భీంగల్ లో కోర్టు భవనం ఏర్పాటు అయితే ప్రస్తుత కోర్టును అక్కడికి తరలిస్తారని తెలిపారు.

More articles

Latest article