. . . సామాన్యుల జేబులకు చిల్లు
. . . ఇల్లు గుల్ల అవుతున్న వైనం
పిట్లం బతుకమ్మ :
పిట్లం మండల కేంద్రంతో పాటు పల్లెల్లో బెల్టు షాపులు ఏరులై పారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 5 గంటలకే మద్యం విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. గ్రామాల వారీగా కొన్ని మద్యం దుకాణాలకు ఏకంగా రూ. 5 లక్షల వరకు వేలం పాటలు నిర్వహించి మరీ బెల్టు షాపులు ఏర్పాటు చేయడం గమనార్హం.
. . . సిట్టింగ్‌లకు కూడా అనుమతి
కేవలం అమ్మకాలే కాకుండా, ఈ షాపుల వద్దే మద్యం తాగేందుకు ‘సిట్టింగ్’ ఏర్పాట్లు కూడా బహిరంగంగానే చేస్తున్నారు. అన్ని రకాల బ్రాండ్ లు అందుబాటులో ఉంచుతూ బెల్టు నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. అక్రమ విక్రయాలతో సామాన్య కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్సైజ్ అధికారుల మౌనం. . . మామూళ్ల మత్తులో ఉన్నారా ?
అక్రమ విక్రయాలు బాహాటంగా జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు నెలవారీగా భారీ ఎత్తున మామూళ్లు అందుతుండటం వల్లే వారు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
