. . . ముస్లిం మత పెద్దలతో సీపీ సమావేశం
బోధన్, బతుకమ్మ :
పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు సీపీ ఆధ్వర్యంలో బోధన్ లోని లయన్స్ క్లబ్ హల్ లో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకారం, శాంతి భద్రతల పరిరక్షణపై చర్చించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పండుగ రోజుల్లో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ చర్యలను అభినందిస్తూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) శుభం ప్రకాష్, బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, ట్రాఫిక్ ఏ.సి.పి మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్.హెచ్.ఓ వెంకట నారాయణ, బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు, రుద్రూర్ సి.ఐ కృష్ణ, బోధన్ ఎస్ఐ లు మనోజ్, హబీబ్, బోధన్ రూరల్ ఎస్.ఐ మచ్చేందేర్ రెడ్డి, ఎడపల్లి ఎస్.ఐ రమ, వర్ని ఎస్.ఐ వంశీ కృష్ణ రెడ్డి, రెంజల్ ఎస్.ఐ చంద్ర మోహన్, ట్రాఫిక్ ఎస్.ఐ మహేష్, కోటగిరి ఎస్.ఐ సునీల్, మున్సిపల్ వైస్ చెర్మన్ ఇలియాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా, ముస్లిం మత పెద్దలు ఖురేషిలు తదితరులు పాల్గొన్నారు.
