నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణం నేటి పరిస్థితుల దృష్ట సరిపోక పోవడంతో ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని కోర్టు అవసరాలకే కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ శ్రమిస్తున్న విషయం ఎరుకనే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు, జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతులను పెద్దఎత్తున అందజేసి పట్టువదలని విక్రమార్కుడిలా నిజామాబాద్ బార్ అసోసియేషన్ తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. జిల్లాకోర్టుకు అనుకుని అనువుగా ఉన్న పైన పేర్కొన్న స్థలాన్ని జిల్లా జుడిశియరి అవసరాలకే ఇవ్వాలనే వినతుల వెల్లువను కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘బార్ ‘తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. నిజామాబాద్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కో కన్వీనర్, సీనియర్ న్యాయవాది దయాకర్ గౌడ్ లను మరోమారు సంప్రదించి బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు వారిని వెంటబెట్టుకుని ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ ఖాళీ స్థలాన్ని పరిశీలన చేశారు.జిల్లాకోర్టు అధికారిక కార్యక్రమాలు, విధులు పెరిగి పోయిన నేపథ్యంలో ప్రతిరోజు వందలాది వాహనాలు ఆవరణ అంతట నిండిపోవడం మూలంగా చాలా కష్టతరంగా మారిపోయిన విషయం గుర్తు చేశారు.అధికార పార్టీ శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పట్టుపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రస్థాయిలో రాజకీయ నిర్ణయం తీసుకుని, అధికారిక ముద్ర వేయాల్సిన ఆవశ్యకతను గడుగు, దయాకర్ లకు తెలియజేశారు. నిరూపయోగంలో ఉన్న స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకురావలసిన అవసరం ఉన్నదని సాయరెడ్డి, మాణిక్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్బంగా గడుగు గంగాధర్, దయాకర్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నతస్థాయిలో అధికారిక నిర్ణయం తీసుకోవలసి ఉందని అందుకు తమవంతు రాజిలేని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. నిజామ్ ప్రభుత్వ ఎలుబడిలో జిల్లాకోర్టుకు భూముల కేటాయింపు జరిగిందని కోర్టుల సంఖ్య, న్యాయమూర్థులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బంది పెరిగినందున ఓల్డ్ విద్యాశాఖ స్థలం కోసం అందరు కలిసికట్టుగా ప్రయత్నాలు చేద్దామని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మంథని రాజేందర్ రెడ్డి అన్నారు.జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి గ్రంధాలయ విస్తరణకు కొంత స్థలం అవసరం ఉన్నదని అన్నారు.
