29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చిన్నారులలో సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్న బాల భవన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు బాల భవన్ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్నాయని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ప్రశంసించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని బాల భవన్ లో శనివారం “కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్” కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Bala Bhavan unleashes creativity in children

 

నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాల భవన్ లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, ఎంతో హృద్యంగా గీసిన కళాకృతులను ఆసక్తితో తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రుధిర్ కళా నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ, చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు.

 

Bala Bhavan unleashes creativity in children

 

పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో  ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్ ను సైతం కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతులలో బాల భవన్ లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా, వారికి శాస్త్రీయ సంగీతం, నృత్యం, మిమిక్రీ, కర్రసాము, డ్రాయింగ్, యోగా, మ్యాజిక్ తదితర 30 అంశాలలో అందిస్తున్న అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక దిగి కలెక్టర్ చిన్నారుల మధ్యకు వెళ్లి వారికి ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులు అందరికీ చాక్లెట్లు పంచుతూ, ప్రతిభ చాటిన బాలబాలికలకు బహుమతులు అందించారు. బాలభవన్ ద్వారా చక్కటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అభినందించారు.

 

Bala Bhavan unleashes creativity in children

 

చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాల భవన్ లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణ ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని, వారికి ఇష్టమైన అంశాలలో తర్ఫీదు ఇవ్వడం వల్ల నైపుణ్యాలు మరింతగా మెరుగవుతాయని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చిన్నారులకు ఉద్బోధించారు.

 

Bala Bhavan unleashes creativity in children

 

నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ, వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఈ తరహా అవకాశాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్, బాల భవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Bala Bhavan unleashes creativity in children

More articles

Latest article