నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సికిల్ సెల్ అనిమియా పై నగరంలోని దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా ఉప ఆరోగ్య సమాచార ప్రచార అధికారి/డిప్యూటీ డెమో దుర్గారావు ముఖ్య అతిథిగా హాజరై వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉండాలని, అయితే సికిల్ సెల్ డిసీస్ లో అవి కొడవలి (సికిల్) ఆకారంలో మారి రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయని వివరించారు. ఇది ఒక వంశపారంపర్య వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలుగా రక్తహీనత, తీవ్రమైన అలసట, శరీర నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వ్యాధి నియంత్రణలో భాగంగా పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం, పోషకాహారం తీసుకోవడం, సమయానికి చికిత్స పొందడం ముఖ్యమని సూచించారు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా సరైన చికిత్సతో నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఆఫ్రికా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇది అధికంగా కనిపిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ శాంతకుమారి, గంగాధర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
