నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాల నాణ్యత పై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గంగాస్తాన్ వివేకానంద మఠం హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్ బి గౌ. అతిధులుగా జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత, విజయ డైరీ మేనేజర్ రమేష్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ పాలు లేని జీవితం లేదని, కాబట్టి పాల నాణ్యత, భోజనంలో నాణ్యత పై అంగన్వాడీ టీచర్లు, అలాగే నిత్యజీవితంలో ముఖ్య పాత్ర వహిస్తున్న గృహీణులు తప్పనిసరిగా ఆహార కల్తీ చట్టాలపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలు వాడకం చేసే ముందు పాల ప్యాకెట్ పై ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని చదవాలని, పాల ప్యాకెట్లపై తయారు తేదీ, నిలువ తేదీ, ఎక్కడ తయారవు తున్నది ఏ ప్రాంతం నుండి ఎక్కడికి వస్తున్నది, అనే వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. పాలలో కల్తీ పై వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘటనలు వెలుగులోకి వస్తున్న క్రమంలో కల్తీ జరుగుతున్న విధానంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ జరుగుతున్న సంఘటనలను గమనించినప్పుడు, అసలు పాలు వాడకం అవసరమే లేదేమో అన్నంత బాధ కలుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పాలు లేని జీవితం ఉండదు కాబట్టి పాలలో నాణ్యత ముఖ్యమని, ఆ క్రమంలో అంగన్వాడీ సెంటర్ల లలో ఫోర్టి ఫైడ్ మరియు టెట్రా పాల పాకెట్ల పాలు ఇస్తున్నట్లు చెప్పారు. గెజిటెడ్ పుడ్ ఇన్సిపెక్టర్ సునీత మాట్లాడుతూ, పాలలో కొరత కారణంగా అక్రమ వ్యాపారస్తులు పాల పరిణామం పెంచడానికి పాలలో కల్తీ చేస్తాలని, పాలలో యూరియా, పిండి పదార్థాలు, ఉప్పు కలపడం, పాలు ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండటానికి హనికరమైన ఫార్మాలిన్ కలుపు తారని అన్నారు. ఆహర కల్తీ నిరోధక చట్టాల ప్రకారం పాలలో కల్తీ పై కఠిన చర్యలకు అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు నూతనంగా వచ్చిన గెజిటెడ్ పుడ్ ఇన్సిపెక్టర్ సునీత పాలలో కల్తీ పై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత మాట్లాడుతూ, పాలలో కల్తీ తో పాటు ఆహర పదార్థాలలో కల్తీ పై తక్షణ చర్యలకు 72073 16531 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. విజయ డైరీ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ లో ఒక్క విజయ మాత్రమే నిజామాబాద్ రైతుల నుండి సేకరించిన మంచి పాలు, నిజామాబాద్ వినియోగదారులకు అమ్మకం చేయడం జరుగున్నదని, మిగతా ప్రయివేటు డెయిరీ లు ఇతర రాష్ట్రాల నుండి పాలను సేకరించి, అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉండటం, వినియోగం రోజు రోజుకు పెరిగి పోతున్నది, ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుండి రవాణా వల్ల ప్రయివేటు రంగంలో ఎక్కువ రోజుల నిల్వ, రసాయనాలు కలువ డానికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు.

