నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆటో చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఈ నెల 5న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ మోహన్ తన చిన్నమ్మ డెలివరీ కోసం వచ్చారు. హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో ఆటో నెంబరు ఏపీ 25 ఎక్స్ 7921 ను పార్కు చేసి మరుసటి రోజు 6వ తేదిన ఉదయం వచ్చి చూసే సరికి తన యొక్క ఆటోను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుని పోయారని గుర్తించి 1వ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 1వ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ బస్టాండ్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బర్కత్ పూరకు చెందిన ఖలీద్ బిన్ మహ్మద్ ఆటోను పట్టుకుని పత్రాలు పరిశీలించగా అనుమానం వచ్చి విచారించగా ఆటో దొంగిలించినట్లు గుర్తించారు. ఆటోను స్వాధీనం చేసుకుని ఖలీద్ బిన్ మహ్మద్ ను రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.


