. . . నిజామాబాద్ రూరల్, అర్బన్, కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాల్లో కార్యక్రమాలపై సంతృప్తి
. . బోధన్, బాల్కొండ నియోజకవర్గల పనితీరుపై తీవ్ర అసంతృప్తి
. . .ఆర్మూర్ నియోజకవర్గంలో కొంచెం మోదం – కొంచెం ఖేదం
. . . రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ విధానాల పై ప్రజల్లో అవగాహన, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలం, క్షేత్ర స్థాయి కార్యక్రమాలు, నాయకత్వ చురుకుదనం, ప్రజా స్పందన వంటి అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.ఈ సమీక్షల్లో ప్రధానంగా ప్రజల మధ్య తిరుగుతూ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులకే ప్రజా ఆదరణ పెరుగుతోందని అభిప్రాయం వ్యక్త మైనట్లు తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా లేదా ప్రకటనల రాజకీయాల కంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వానికే భవిష్యత్తులో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని సూచించినట్లు తెలిసింది.
సమీక్షలో భాగంగా నిజామాబాద్ రూరల్, అర్బన్, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందన, ప్రభుత్వం పై రాజకీయ ఒత్తిడి తీసుకు రావడంలో చురుకుదనం కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.జగిత్యాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయ స్థలం అంశంపై భోగ శ్రావణి చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే అనూప్ రావు చేరిన తర్వాత కోరుట్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని చర్చ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ రూరల్‌లో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుండడం సానుకూలంగా నమోదైనట్లు తెలిసింది. అర్బన్ నియోజకవర్గంలో గెలిచిన 28 మంది కార్పొరేటర్లను మరింత సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ ఉండాలని సూచించినట్లు సమాచారం.

అయితే బాల్కొండ, బోధన్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే లను రాజకీయంగా నిలదీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక అంశాలు ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం వాటిని ఉద్యమాలుగా మలచడంలో వెనుకబడి ఉందని అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నా వాటిపై నిరంతర పోరాటాలు, ధర్నాలు, ప్రజా సమావేశాలు, మీడియా స్పందన వంటి అంశాల్లో ఆశించిన స్థాయి చొరవ కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రజా సమస్యలు రాజకీయ చర్చ గా మార్చే ప్రయత్నాల్లో లోపం కనిపిస్తోందని, పార్టీ నిర్మాణాన్ని కేవలం సమావేశాలకు పరిమితం చేయకుండా ప్రజా ఉద్యమాలతో ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.
ఆర్మూర్ నియోజకవర్గం కూడా ప్రత్యేక సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి కొంచెం మోదం కొంచెం ఖేదం అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆర్మూర్ లో పార్టీకి అనుకూల స్పందన కనిపిస్తున్నప్పటికీ, అంతర్గత గ్రూపు ప్రభావం వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంటుందని సమీక్షలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి అప్పజెప్పి నప్పటికీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రా లేదని, పార్టీ బలం గా ఉన్నచోట ఈ ఫలితాలు కార్యకర్తలకు నిరుత్సాహాన్ని కలిగించాయి.ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం, స్థానిక స్థాయిలో సమన్వయం లోపించడం, ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లడంలో ఇబ్బందులు కనిపించడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. నాయకత్వం సమిష్టిగా ముందుకు వెళ్లి క్యాడర్‌లో నమ్మకం పెంచాలని సూచించినట్లు తెలిసింది.

ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, కేవలం విమర్శలకు పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎస్ఐఆర్ అంశంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చర్చ జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, ప్రతి మండలంలో క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదని , ప్రజల్లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైనట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ అనుకూలతను ఓట్లుగా మార్చుకోవాలంటే క్షేత్రస్థాయిలో మరింత శ్రమ, సమన్వయం, నిరంతర ప్రజా కార్యక్రమాలు అవసరమని సూచించినట్లు తెలిసింది.