నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగర కాంగ్రెస్ కమిటీ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఇటీవల చేపట్టిన అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో జరిగిన సంప్రదింపుల అనంతరం నగర డిసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మే 30వ తేదీన డివిజన్ అధ్యక్షుల నియామకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని డివిజన్లకు సంబంధించిన నియామకాలపై పార్టీకి ఫిర్యాదులు అందడంతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుమార్ రావు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని బొబ్బిలి రామకృష్ణ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలకు సంబంధించిన డివిజన్ అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. అందిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి సంబంధించి నియామకాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇటీవల జరిగిన డివిజన్ అధ్యక్షుల నియామకాలపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తనను సంప్రదించాలని బొబ్బిలి రామకృష్ణ కోరారు.
