. . . ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేయాలని అదేశించాం
. . . సోమార్ పేట్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి బిట్ల భారతి (హైదరాబాద్ యశోద ఆసుపత్రి) , బాలమణి (వెల్ నెస్ హాస్పిటల్) చికిత్స పొందుతున్న వారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్ లో పరామర్శించి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సంబంధిత ఆసుపత్రులలోని వైద్యులతో మాట్లాడి, గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల పై సమాచారం తెలుసుకున్నారు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఖర్చుకు వెనుకాడకుండా అత్యుత్తమ చికిత్స అందించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్య సేవలు అందించాలని వైద్యులను ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. అదేవిధంగా, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఈ కష్ట సమయంలో తాము పూర్తిగా వారి పక్షాన ఉన్నామని, అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరం, హృదయ విదారకం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, డీఎస్పీ లతో మాట్లాడి సంపూర్ణ విచారణ చేపట్టాలని ఆదేశించామని, ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని రిమాండ్కు తరలించినట్లు కూడా వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

