. . . ప్రజల భాగస్వామ్యంతో 6 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
కామారెడ్డి, బతుకమ్మ :
గ్రామ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా బూరుగుపల్లి గ్రామం మరో ఆదర్శంగా నిలిచింది. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామంలో ఆరు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ కెమెరాలను పెద్దకొడంగల్ ఎస్సై జి.అరుణ్ కుమార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యుల సమక్షంలో బుధవారం ప్రారంభించారు. గ్రామంలో కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు నేరాల నివారణకు, అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు, నేరస్థులను గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల సహకారంతో గ్రామాల్లో భద్రతా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. గ్రామ భద్రత కోసం బూరుగుపల్లి ప్రజలు స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని తెలిపారు. జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర మాట్లాడుతూ బూరుగుపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని ఇతర గ్రామాలు కూడా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు – పోలీసుల భాగస్వామ్యమే సురక్షిత సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని ఆయనన్నారు. గ్రామ ప్రజల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం కమ్యూనిటీ పోలీసింగ్‌కు మంచి ఉదాహరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
