భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణానికి చెందిన శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2005-06 ఎస్.ఎస్.సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా నిర్వహించారు.
లింబాద్రిగుట్ట రోడ్డుకు వెళ్లే దశాగౌడ్ ఫామ్ హౌస్ వేదికగా ఉదయం 10 గంటల నుండి18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆత్మీయంగా విద్యార్థులు కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దివంగతులైన పాఠశాల వ్యవస్థాపకులు అబ్సింగ్ జయంతి రావు, పూర్వ విద్యార్థులు అట్టి మల్ల కార్తీక్, కొండూర్ బాల జ్యోతి, సతీష్ లకు ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం మౌనం పాటించారు. సరస్వతి మాత, జయంత్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ఇన్నేళ్ల తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవడం సంతోషకరం అని అన్నారు.గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మహోన్నతమైనదని అన్నారు.విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక,రాజకీయ, సామాజిక సేవ, సకల రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వోద్యోగులుగా రాణించి,కష్టాల్లో ఆపద్బాంధవులుగా నిలవాలని కాంక్షించారు.విద్యా బోధనలు చేసిన గురువులకు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. కార్యక్రమానికి ప్రసిద్ధ కవి కంకణాల రాజేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభకు వన్నెతెచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అభిసింగ్ సంగీత, బద్రి జలజ, బొప్పారం శ్రీనివాస్, కంకణాల రాజేశ్వర్, మాణిక్యాల శ్రీనివాస్, భాను ప్రకాష్, గణేష్, రాజకుమార్ లు విద్యార్థిని, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.