27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి సొసైటీకి యూరియా నిల్వల కేటాయింపులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతు వేదికల ద్వారా కూడా యూరియా పంపిణీకి ఏర్పాట్లు

 

. . . ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని అన్నారు. అన్ని సొసైటీలకు ఎరువులను చేరవేస్తూ, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా పంపిణీ జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా ఎరువుల కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు యూరియా బస్తాలను కేటాయిస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో లక్షా 39 వేల మంది రైతులకు బుకింగ్ యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3.78 లక్షల బస్తాల యూరియా ఎరువు పంపిణీ జరిగిందని వెల్లడించారు. ఒక్కో ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నామని అన్నారు. 3 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన రైతులకు రెండు విడతలలో యూరియా కేటాయించబడుతోందని, ఐదు ఎకరాల వరకు 40:30:30 నిష్పత్తిలో మూడు విడతల్లో, ఐదు ఎకరాలు పైబడి విస్తీర్ణం కలిగిన వారికి 40:20:20:20 నిష్పత్తిలో నాలుగు విడతలలో యూరియా విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆన్లైన్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న 24 గంటల లోపు సంబంధిత సొసైటీ లేదా డీలర్ షాప్ నుండి యూరియా కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. యూరియా ఎరువుల విషయమై రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఇప్పటికే ఇంకనూ 28వేల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని కలెక్టర్ భరోసా కల్పించారు. కాగా, ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ రాయితీలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ కీలకం కానుందని సూచించారు.

More articles

Latest article