27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్ కే ఆర్ కేంద్రంగా కిరికిరి

Must read

📰 Generate e-Paper Clip

. వివాదాస్పదమైన 235 గజాల ప్లాటు

. రాజకీయరంగు పులుముకున్న లొల్లి

. రాంకిషన్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్ కే ఆర్ అపార్ట్ మెంట్ వద్ద 235 గజాల ప్లాటు వివాదం రాజకీయరంగు పులుముకుంది. అపార్ట్ మెంట్ అవుట్ గేటు ప్రాంతంలో తనకు 235 గజాల ప్లాటు ఉందని, దానిని అపార్ట్ మెంట్ వాసులు కబ్జాకు యత్నిస్తున్నారని కోడూర్ నగేశ్ కుమార్ అనే వ్యక్తి చెబుతున్నారు. మరో వైపు తాము నాలుగేళ్లుగా రాకపోకలు సాగిస్తున్న రోడ్డును కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకుడి పేరు చెప్పి బెదిరిస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు.

అసలు వివాదం ఎక్కడి నుంచి..

ఓ నిర్మాణ సంస్థకు బీఆర్ఎస్ నేత రాంకిషన్ రావు కొడుకు, కోడలు, కోడూరు నగేశ్, మరో వ్యక్తి కలిసి ఖాళీ స్థలాన్ని డెవలప్ మెంట్ కు ఇవ్వగా ఆ స్థలంలో అపార్ట్ మెంట్ నిర్మాణం పూర్తయ్యింది. అయితే సర్వే నంబర్ 219లోని ఆ స్థలంలో తనకు 235 గజాల ప్లాటు ఉందని నగేశ్ పేర్కొంటున్నారు. నగేశ్ తనది అని చెబుతున్న ప్లాటు వద్ద ఆర్ కే ఆర్ అపార్ట్ మెంట్ అవుట్ గేటు ఉండగా, అందులో నివాసం ఉంటున్న వారు ఆ దారిని నాలుగేళ్లుగా వినియోగిస్తున్నారు. 235 గజాల ప్లాట్ తో అపార్ట్ మెంట్ కు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా తన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని నగేశ్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన వద్ద స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ లో టాక్స్ సైతం చెల్లిస్తున్నానని ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నగేశ్ అంటున్నారు. సోమవారం రాత్రి నుంచే ప్లాటు వద్ద వివాదం రాజుకుంది. నగేశ్ తన ప్లాట్ లో షెడ్డు వేసేందుకు అవసరమైన సామగ్రి తీసుకొచ్చాడు. మంగళవారం ఉదయం కంకర, సిమెంట్ తీసుకురాగా అపార్ట్ మెంట్ వాసులు అడ్డుకున్నారు. ఇది గొడవకు దారి తీసింది.

 బీఆర్ఎస్ నాయకుడితోపాటు అనుచరులపై కేసులు

తమను బీఆర్ ఎస్ నాయకుడు రాంకిషన్ రావు అనుచరులు బెదిరించి స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు స్థలం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మహిళ కమిషన్ సభ్యురాలి భర్త సూదం రవిచందర్, నగేశ్ తోపాటు పలువురితో వాగ్వావాదానికి దిగారు. తమపై బీఆర్ఎస్ నాయకుడి అనుచరులు దాడి చేశారని దుర్భాషలాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కేసులకు దారితీసిన రాజకీయ బంధుత్వం

జన్నేపల్లికి చెందిన కోడూర్ నగేశ్  అల్వాల్ మైనంపల్లి హనుమంతురావు బావమరిది కాగా, తమను బెదిరించారని ఆర్ కే ఆర్ అపార్ట్ మెంట్ వాసులు ఆరోపించిన వ్యక్తి రాంకిషన్ రావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామ కావడంతో ఈ వివాదంలోకి రాజకీయ పెద్దలు రంగప్రవేశం చేశారని పలువురు పేర్కొంటున్నారు. గత కొంత కాలంగా లోలోన నడుస్తున్న వివాదం ఇప్పుడు బహిరంగం కాగా, రాంకిషన్ రావును ఏ1గా చేసి 351(2)బీఎన్ఎస్, 3(1) (ఆర్)(ఎస్) ఎస్సీ, ఎస్టీ సెక్షన్ ల కింద రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మిగతా వారిని తరువాత బాధ్యులుగా చేశారు.

 రాంకిషన్ రావుకు సంబంధం లేదని చెబుతున్నా..

తన ప్లాట్ వివాదంతో బీఆర్ ఎస్ నాయకుడు రాంకిషన్ రావుకు సంబంధం లేదని కోడూరు నగేశ్ బహిరంగంగా చెబుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసులు రాంకిషన్ రావుపై కేసు నమోదు చేయడం వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నిర్మాణ సంస్థకు డెవలప్ మెంట్ కు ఇచ్చి నిర్మాణం పూర్తయిన తరువాత రాంకిషన్ రావు దూరంగా ఉంటున్నారని అంటున్నారు.  

 ఆడియో ఆధారంగా కేసు

బీఆర్ ఎస్ నాయకుడు రాంకిషన్ రావు కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరు స్థలం డెవలప్ మెంట్ కు ఇచ్చిన సమయంలో ఒక విధంగా ఒప్పందం చేసుకుని ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. డెవలప్ మెంట్ కు ఇచ్చిన స్థలాన్ని వదిలి మిగిలి ఉన్న స్థలం (235గజాలు) అంశాన్ని మున్సిపాలిటీ నుంచి మార్టిగేజ్ రిలీజ్ అయ్యేంత వరకు లేవనెత్తలేదని అంటున్నారు. అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ కు రాంకిషన్ రావు ఫోన్ చేసి నగేశ్ పేరుపై ఉన్న 235 గజాల స్థలానికి ధర ఒప్పందం చేసుకుని తీసుకోవాలని, లేనిపక్షంలో తాము అక్కడ కార్యాలయం నిర్మించుకుంటామని చెప్పినట్లు తెలిసింది.  ఈ క్రమంలో తమను రాంకిషన్ రావు దుర్భాషలాడుతూ బెదిరించారని రాంకిషన్ రావుపై అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ తోపాటు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆడియో కాల్, అనుచరుల బెదరింపుల ఆధారంగా పోలీసులు రాంకిషన్ రావుపై కేసు నమోదు చేశారు.

More articles

Latest article