. . . కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివిధ రాజకీయ పార్టీల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ కేశవరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తొలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో మంత్రి పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం అధికారికంగా కమిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల జ్యోతి కార్యాలయం కింద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న ఉద్యమ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఉద్యమకారుల గుర్తింపుకు నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యమంలో గాయపడిన వారిని రెండో కేటగిరీగా గుర్తించాలని ప్రతిపాదించారు. ఉద్యమ సమయంలో అరెస్టులు, జైలు శిక్షలు, కేసులు ఎదుర్కొన్న వారిని మూడో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించారు. గ్రామీణ, క్షేత్రస్థాయిలో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిని నాలుగో కేటగిరీలో గుర్తించాలని సూచించారు. వీరి గుర్తింపుకు పేపర్ కటింగ్స్, ఆధారాలను పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పౌరసమాజం తరఫున కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. 1969, 1972, 1996 తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, చరిత్రను కాపాడేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఉద్యమకారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన సహాయం అందిందని, ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేరళ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన అనంతరం కమిటీ ప్రతిపాదనలపై ఆయనతో సమావేశమై చర్చించాలని కమిటీ నిర్ణయించింది.

