27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భారత వాయుసేన (ఐఎఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ను అన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్‌లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూముల బదలాయింపునకు సహకరించినందుకు రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. దేశ భద్రత, సమగ్రతకు సంబంధించిన కీలక ప్రాజెక్టుగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం పేర్కొన్నారు. భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల అవసరాల కోసం పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న టెర్మినల్ భవనం, కార్గో సదుపాయాలు, ఎంఆర్‌వో, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించాలని రక్షణ మంత్రిని సీఎం కోరారు. ఇటీవల మధ్య ఆసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ స్థాయి విమానయాన సంస్థలు తమ హ్యాంగర్ల ఏర్పాటుకు అనుకూల ప్రాంతాలను అన్వేషిస్తున్నాయని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ హ్యాంగర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉండటంతో ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ తమ కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నందున, ఆ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article