. . . తహసీల్దార్ లత హెచ్చరిక
మహమ్మద్ నగర్, బతుకమ్మ :
ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ లత హెచ్చరించారు. మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్ 70/1లోని ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లత మాట్లాడుతూ, సంబంధిత భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిలో వరి నాట్లు వేయవద్దని ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ, సూచనలు పట్టించుకోకుండా వరి నాట్లు వేయడంతో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలాగే ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఎవరైనా తొలగిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.