ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

0 8,231

 

. . . విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు నవాతే ప్రతాప్

 

బోధన్, బతుకమ్మ :

 

ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థ సంఘాల జేఏసి నాయకుడు నవాతే ప్రతాప్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ, యూనిఫాంల విక్రయాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని విద్యార్థి సంఘాల జేఏసీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శుక్రవారం బోధన్‌లోని పీఆర్టీయూ భవన్‌లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకుడు నవాతే ప్రతాప్ మాట్లాడారు. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం పాఠశాల ప్రాంగణంలో లేదా సమీపంలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు నిర్వహించరాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వాటిని పట్టించుకోకుండా విద్యార్థులకు బలవంతంగా పుస్తకాలు కొనుగోలు చేయిస్తూ, అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోయినా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సహా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డి. నాగరాజు, నాయకులు యన్. బాల్‌రాజ్, మావురం శ్రీకాంత్, ప్రశాంత్, కిరణ్, రాజన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.