28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రవాణా శాఖపై ఏసీబీ నజర్

Must read

📰 Generate e-Paper Clip

  • ఏకకాలంలో 18కార్యాలయాలపై ఏసీబీ అధికారుల దాడులు
  • రవాణా శాఖ అంత:రాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
  • పరారీలో ఆర్టీవో చెక్ పోస్ట్ అధికారుల అసిస్టెంట్లు
  • ప్రతి లారీ డ్రైవర్ నుంచి రూ.500 చొప్పున వసూళ్లు
  • ఏడాదిలో రెండోసారి ఏసీబీ దాడులు జరిగిన మారని వసూళ్ల పర్వం

 

రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పక్కాగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు.  ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18కార్యాలయాలపై మూకుమ్మడిగా అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వారికి తొత్తులుగా  మారిన ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాలపై ఏసీబీ  అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేటు  మూసివేసి  తిరుమలగిరిలో  10, ఉప్పల్ లో మరో 10మంది ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్టీఓ కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గుమిగూడిన ఏజెంట్లు అంతా అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు ఆకస్మిక తనిఖీల కారణంగా కార్యాలయం ఎదుట వారు గంటలుగా వేచి ఉన్నారు.

 

మద్నూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్ పోస్ట్ పై బుధవారం అర్థరాత్రి నుంచి ఏసీబీ అధికారులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు గురువారం మద్యాహ్నం వరకు సాగాయి. నిజామాబాద్ రెంజ్ ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఏసీబీ అధికారుల ఆకస్మీక దాడులతో ఈ చెక్ పోస్ట్ లో పనిచేసే ఆర్టిఓ అధికారుల అసిస్టెంట్లు (ప్రైవేట్ వ్యక్తులు) పరారయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద ఈ చెక్ పోస్ట్ అధికారులు భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఏసీబీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఆర్టిఏ చెక్ పోస్టులపై ఏసీబీ డిజీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. సలబత్ పూర్ చెక్ పోస్టులో ఎఏంవిఐ కవిత విధులు నిర్వహిస్తుండగా ఒక కానిస్టెబుల్ తో పాటు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద మొత్తం రూ.92 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు.

తెలంగాణ – మహరాష్ట్ర సరిహద్ధు ప్రాంతమైన సలబత్ పూర్ ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ప్రతి లారీ డ్రైవర్ నుంచి రూ.500 చొప్పున  వసూలు చేస్తున్నారు. డబ్బులు ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఉన్న డబ్బాలో వెస్తేనే లారీ ముందుకు కదులుతుందని అధికారులు గుర్తించారు. అంతర్ రాష్ట్ర రహదారిపై రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లతో ఏసీబీ సిబ్బంది అక్రమ వసూళ్ల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అయినందున ప్రతిరోజు వేల సంఖ్యలో లారీలు మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు సరుకుల రవాణా చేస్తాయి. ఈ చెక్ పోస్ట్ లో నిబంధనల ప్రకారం సరుకు లారీలను పరిశీలన జరిపి టాక్స్ వసూలు చేయవలసి ఉండగా అలాంటిదేమీ చూడకుండా ప్రతి లారీ డ్రైవర్ వద్ద రూ.500 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

ప్రతిరోజు లక్షల రూపాయలు అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు ఏసీబీ దాడులతో బట్టబయలైంది. ఇక్కడ డ్యూటీలు చేయడానికి రాష్ట్రంలో పైరవీలతో వస్తారని చర్చ జరుగుతోంది. దాని అసలు కారణం ఒక్కొక్క డ్యూటీలో లక్షల రూపాయలు అక్రమ వసూళ్లతో జేబులు నింపుకోవడమే. ప్రభుత్వం ఆదాయానికి రావలసిన ఆదాయాన్ని రాబట్టకుండా అక్రమ వసూళ్లకే పాల్పడుతున్నారు అనడానికి ఏసీబీ దాడులే నిదర్శనం. ఏది ఏమైనా ఆరు నెలల కాలంలో రెండోసారి ఏసీబీ దాడులు జరగడం ఆర్టీవో శాఖ అధికారుల్లో దడలు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి అంకంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని సలబత్ పూర్, సాలూర ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ చేసిన దాడుల్లో నగదు దొరికింది. కాని అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొలేదు. దానితో ఏసీబీ తనిఖీల మర్మం తెలిసిన రవాణాశాఖ అధికారులు తెలివిగా చెక్ పోస్టుల వద్ద, కార్యాలయాల వద్ద కలెక్షన్ ఏజేంట్ లుగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వసూళ్ల పర్వం చేపడుతున్నారని బుధవారం రాత్రి నుంచి జరుగుతున్న సోదాలలో తేటతెల్లమైంది. ఈ సారైనా  లెక్కకు మించి నగదు పట్టుబడిన చోట అధికారులపై రవాణా శాఖ ఏసీబీ సిపారసు మేరకు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

ACB eyes transport department

More articles

Latest article