29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏసీబీ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • రవాణా శాఖ కార్యాలయాల వెలవెల
  • కనిపించని ఏజెంట్ల సందడి
  • కార్యాలయం ఆవరణ అంతా నిర్మానుష్యం
  • ఏజంట్ల పనులకు బ్రేక్ కు అధికారుల నిర్ణయం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి ఆర్టీవో, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలోని యూనిట్ కార్యాలయాలు గురువారం వరకు సందడిగా ఉండేవి. చివరకు ఉమ్మడి జిల్లాలోని మూడు చెక్ పోస్టులలోనూ వాహనదారులు, రవాణా శాఖలో ఏజంట్లతో కళకళలాడేది. గురువారం ఆర్మూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ దాడితో అంతా తారుమారైంది. ఇటీవల కాలంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించిన వెనక్కి తగ్గని రవాణా శాఖాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా వసూళ్ళ కార్యక్రమాన్ని ఏజంట్ల ద్వారా చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆర్టీఏ ఏజంటే ఏసీబీకి ఎంవీఐని డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడంతో అంతా తారుమారైంది.
నిజామాబాద్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వాహనదారులు ఏజెంట్లతో సందడిగా ఉండేది. గురువారం ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి ఆర్టిఏ ఏజెంట్ నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దానితో శుక్రవారం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సందర్శకులు, ఏజెంట్లు లేక బోసిపోయింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట 50 వరకు ఏజెంట్ల కార్యాలయాలు ఉండగా అక్కడ వాహనాదరులు లేక సందడి తగ్గింది. అధికారులు సైతం ఆలస్యంగా రావడం విశేషం. రవాణా శాఖ లో అంతా ఏజంట్ల తో పనులు చక్కపెడుతూ డబ్బులు వసూల్ చేస్తున్నా అర్టీఏ అధికారులు ఏజంట్ నేరుగా ఏసీబీకి ఎంవీఐని పట్టించడం అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏజెంట్లతోని పనులు చేస్తున్నా అధికారులు వారిని కార్యాలయంలో ప్రధాన గేటు వద్ద ఉన్న సిబ్బందికి ఆదేశించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాకు డిపార్ మెంట్ కు హెడ్ అయిన డిటిసి కార్యాలయంలోకి ఏజెంట్ లకు నో ఎంట్రీ ప్రకటించారు.
నిన్న మొన్నటి వరకు ఏజెంట్లను రాచమర్యాదలతో అనుమతించిన కానిస్టేబుల్స్, గార్డులు కేవలం వాహనదారులను మాత్రమే లోనికి అనుమతించడం గమనర్హం. జిల్లాలో చాలా రోజుల తర్వాత ఎంవీఐ ఏసీబీకి చిక్కడం అందుకు ఏజెంట్ కారకుడు కావడంతో సహాయ నిరాకరణకు అధికారులకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏజెంట్ల సంఘం ప్రతినిధులఫై రవాణా శాఖ అధికారులు ఫైర్ అయినట్టు విశ్వసినీయ సమాచారం. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం తో పాటు బోధన్,ఆర్మూర్,కామారెడ్డి,బాన్సువాడ కార్యాలయాలకు ఆర్టీఏ ఏజెంట్లను అనుమతించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గడిచిన నెలలో ఉమ్మడి జిల్లాలో మూడు చెక్ పోస్టు ల ఫై ఏసీబీ దాడి నిర్వహించగా తనిఖీలలో ఎక్కడ కూడా నేరుగా ఏసీబీ అధికారులకు రవాణాశాఖ అధికారులు చిక్కలేదు. అక్కడ ఏజెంట్లే డబ్బులు తీసుకుంటూ దొరకడంతో పార్టీ అధికారులు బతికిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రవాణా శాఖ అధికారులకు ఏజెంట్లతో ఉన్న సంబంధాలు బట్టబయలు అయ్యాయి. కానీ ఉమ్మడి జిల్లాలో చాలా రోజుల తర్వాత ఏసీబీకి రవాణా శాఖ అధికారులు నేరుగా దొరకడం వెనుక ఏజెంట్లు కారణం కావడంతో తాత్కాలికంగా వసూల కార్యక్రమానికి అధికారులు బ్రేక్ వేసుకున్నట్టు తెలిసింది.

More articles

Latest article