- లచ్చ పేటలో మొదటి ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బతుకమ్మ, మాచారెడ్డి: దాదాపు 22 ఏళ్ల తర్వాత కలయిక… చదువులమ్మ ఒడిలో కుదిరిన స్నేహ బంధపు మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందభాష్పాల ను పంచుకున్నారు. మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02 మొదటి పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహణకు వారు నాంది పలికారు. తమ గురువులను ఈ సమ్మేళనానికి ఆహ్వానించి వారికి శాలువాతో సన్మానించి మెమొంటోను అందించారు. పూర్వ విద్యార్థులందరూ తమను ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ వారి బతుకు చిత్రాన్ని ఆవిష్కరించారు. చదువుకున్న రోజుల్లో తమ ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని చిలిపి చేష్టల్ని గుర్తు చేసుకున్నారు. గురువులు నేర్పిన క్రమశిక్షణ వల్లనే తాము ఈరోజు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు వివరించారు. తాము చదువుకున్న పాఠశాలకు వెన్నుదన్నుగా ఉండి తమవంతు సహాయ సహకారాలు అందించి భావితరాలకు బాటలు వేస్తామని ఈ సందర్భంగా వారు తమ సంకల్పాన్ని వెలిబుచ్చారు. విద్యాబుద్ధులు అందించిన ఉపాధ్యాయులను మరవకుండా తమను ఈ వేడుకకు ఆహ్వానించి గౌరవించినందుకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పూర్వ విద్యార్థుల గురువులు నారాయణరావు, ప్రవీణ్, జయరాం శర్మ, బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
