25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండుగా చీలిన మూడవ సొసైటీ

Must read

📰 Generate e-Paper Clip

  • మూడవ కల్లుడిపోలో రెండు గ్రూప్ లు
  • సపరేట్ గా కల్లు విక్రయాలు 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్లు విక్రయాల్లో పేరు గాంచిన మూడవ సొసైటీ రెండుగా చీలిపోయింది. 2016లో పురుడుపోసుకుని 2017లో ప్రారంభమైన మూడవ కల్లుడిపో కొద్ది కాలంలోనే సొసైటీ రెండు ముక్కలైంది. సొసైటీపై ఒక కుటుంబానికి పెత్తనం దక్కడంతో సొసైటీ ఓ వైపుగా, కార్మికులు మరోవైపుగా చీలిపోయారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘంలో ఉన్న లుకలుకలు బహిర్గతమైన విషయం తెల్సిందే. కల్లుడిపోలో ఆర్థిక లావాదేవిలు మొదలుకుని సొసైటీలో పెత్తనం అంతా ఒకే కుటుంబానికి ఉందని కార్మికులు తిరుగబడిన విషయం విధితమే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎక్సైజ్, జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కల్లుడిపో నిర్వాహణ కోసం రెండు గ్రూప్ లు రాజీకొచ్చాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘంలో కార్మికులు మొదలుకుని కల్లుబట్టిల వరకు పంపకాలు చేసుకుని నిర్వాహణకు అంగీకరించారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సొసైటీలో గ్రామాలకు చెందిన వారు ఎలా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. అందులో భాగంగా గ్రామాలలోనూ ట్యాడి టాపర్ లైసెన్స్ ఉన్న వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సొసైటీలు గీత కార్మికులుగా ఎలా సభ్యత్వం ఉంటుందని కొందరు ప్రశ్న లేవనెత్తారు. అంతేగాకుండా కార్మికులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పోను మిగిలిన సొమ్మును సొసైటీ సంఘ సభ్యులకు ఇవ్వకుండా ఒకే కుటుంబం తీసుకోవడంపై సొసైటీ సభ్యులు మండిపడ్డారు. సొసైటీ పదవులను అనుభవించడంతో పాటు లాభాలను కూడా వారే తీసుకోవడంపై కార్మికులు మండిపడ్డారు. ఈ విషయంలో గీత కార్మికులకు సొసైటీలో సంఘ సభ్యులు మద్దతు తెలుపడంతో సొసైటీ పాలకవర్గంపై తిరుగుబాటు జండా ఎగురవేశారు. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో సొసైటీ బాధ్యులు, కార్మికులు చర్చలకు అంగీకరించి డిపో నిర్వాహణకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. సొసైటీలో 400 మంది సభ్యులు ఉండగా 58 శాతం ఒకరికి, 42 శాతం మరొకరు పంచుకోవాలని నిర్ణయించారు. ఒక గ్రూప్ వారికి 29 మంది కార్మికులు, మరో గ్రూప్ వారికి 24 మంది కార్మికులుగా పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 19 కల్లుబట్టిలు ఉండగా 11 ఒక గ్రూప్ కు, 8 కల్లుబట్టిలు మరో గ్రూప్ కు వచ్చాయి. ప్రస్తుతానికి 14 మాత్రమే నడుస్తుండగా మిగిలిన సొసైటీల కల్లుబట్టిలను కూడా పంచుకుని క్రయవిక్రయాలను జరుపుకోవాలని తీర్మానించారు. దసరా నుంచి కొత్త మామూల ఎవరికి వారు చేసుకునే విధంగా తీర్మాణం జరిగినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 1వ కల్లుడిపోలోనే 2వ డిపోను నడుపుతుండగా 3డిపో రెండుగా చీలడంతో వాటి మనుగడ ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది. 400 మంది కుల సభ్యులతో పాటు 53 మంది కార్మికుల భవితవ్యం ఆధారపడిన కల్లు డిపో వ్యవహరం దాని క్రయవిక్రయాలపై ప్రభావం చూపుతుందని చెప్పాలి.

More articles

Latest article