. వెన్నుపూసకు తీవ్రగాయాలు
. కోతుల గుంపు రావడంతో ఘటన..
. విచారణ చేపట్టిన అధికారులు
ఏర్గట్ల, బతుకమ్మ: ఏర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ బిల్డింగ్ పైనుంచి తొమ్మిదో తరగతి విద్యార్థిని అంజలి కింద పడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన అంజలి ఇటీవల సొంతూరికి వెళ్లి ఆదివారం రోజున హాస్టల్ కు తిరిగి వచ్చింది. తన దుస్తులను ఉతుక్కున్న అంజలి వాటిని ఆరేసేందుకు బిల్డింగ్ పైకి వెళ్లింది. అక్కడే ఉన్న కోతుల గుంపు ఆమె పైకి రావడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఈ ఘటనలో అంజలి వెన్నుపూసకు తీవ్రగాయాలు కావడంతోపాటు చేయి విరిగింది. స్కూల్ సిబ్బంది విద్యార్థి అంజలిని 108 అంబులెన్స్ లో దగ్గరలోని మేడిపల్లి ఆస్పత్రికి ఆ తరువాత ఆర్మూర్ లోని ఆర్థో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నిజామాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై తహసీల్దార్ శ్రీలత, ఎంవో ఆనంద్ రావు, పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణాచారి, ఆర్ ఐ సదానంద్ విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు.
