23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పీఎఫ్ పెన్షన్ పెంచడానికి ప్రత్యేక బిల్లు తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షుడు రాపెలి శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీడీ పరిశ్రమలో పనిచేసి పదవీ విరమణ చేసిన కార్మికుల పీఎఫ్ పెన్షన్‌ను రూ.వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక బిల్లు తీసుకురావాలని మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షుడు రాపెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈపీఎఫ్ఓ పరిధిలోని ఈపీఎస్ – 95 పెన్షనర్ల కోసం ప్రత్యేక అదనపు పెన్షన్ ఆర్థిక నిధి చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికుల్లో అర్హత కలిగిన పెన్షనర్లకు నెలకు రూ.6 వేలు పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయనన్నారు. అలాగే ప్రతి పెన్షనర్‌కు రూ.లక్ష సహజ మరణ బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజీనామా చేసిన నెలసరి ఉద్యోగ పెన్షనర్లకు కనీస వేతనాల్లో 50 శాతానికి తగ్గకుండా, కనీసం రూ.9 వేలకు పైగా పెన్షన్ అందించేలా ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాపెలి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈపీఎస్-95 పెన్షనర్ల పెన్షన్ పెంపు కోసం ప్రత్యేక పెన్షన్ ఆర్థిక నిధి చట్టం సాధించే వరకు దేశవ్యాప్తంగా వినతుల ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జీఎస్టీ ద్వారా వచ్చే వార్షిక ఆదాయంలో ఒక శాతం మొత్తాన్ని పెన్షన్ పెంపు కోసం ప్రత్యేక నిధిగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఎఫ్ కార్యాలయం ఎదుట ప్రారంభించిన వినతుల ఉత్తరాల ఉద్యమంలో కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. అనంతరం ఈపీఎఫ్ఓ రీజినల్ కమిషనర్‌కు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బట్టల వర్తకుల సంఘం జిల్లా అధ్యక్షుడు జాడే సంతోష్, న్యాలపెళ్లి శ్రీనివాస్, ఎంజేపీ రాష్ట్ర నాయకులు బొడ్డు గంగాధర్, సాయినోళ్ల పోశెట్టి, మేక భూమయ్య, విద్యార్థి నాయకుడు మంగోల్ ఎల్లయ్య, భారత రాజ్యాంగ ప్రచార నాయకుడు బత్తుల రవి, సనాతన ధర్మ ప్రచారకుడు రాసమల్ల గంగాధర్, రిటైర్డ్ బీడీ కార్మికులు భూమయ్య, వెంకటేష్, పెన్షనర్లు పెరమాండ్లు భోజవ్వ, శశికళ, ఇంద్ర, వసంత, భాగ్య, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

A special bill must be introduced to increase the PF pension.

More articles

Latest article