. భవానీ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం వివాదాలకు ముగింపా?
. నిజామాబాద్ మూడో డిపో పరిధిలో కల్లు బట్టీల పంపకాలు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని( భవానీ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం ) మూడో కల్లు డిపో వివాదాలకు చెక్ పడినట్లేనా? అంటే.. అవుననే సమాధానం సొసైటీ, కార్మికుల నుంచి వస్తోంది. జిల్లా కేంద్రంలోని మూడో డిపో పరిధిలో 19 కల్లు బట్టిలు ఉండగా, చర్చల జరిపి మెజార్టీ కార్మికుల ఆధారంగా ఓ గ్రూప్ నకు 11, మరో గ్రూప్ నకు 8 కల్లుబట్టీలు కేటాయించకున్నారని, వాటిలో కల్లు విక్రయాలు చేసుకోవాలనే ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది.
మూడో కల్లు డిపోలో గత కొంతకాలంగా పాలక వర్గానికి, గీత కార్మికులకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సొసైటీ పేరుమీద జరుగుతున్న తంతులో కార్మికులకు అన్యాయం జరుగుతోందని వివాదం చెలరేగింది. అంతే కాకుండా లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తోపాటు ఒకే కుటుంబం పెత్తనం అంటూ గ్రూపు లుగా విడిపోయి, సొసైటీలో అవినీతి అక్రమాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకున్నారు. సహకార శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని నిరసనలకు దిగినప్పటికీ ఎక్కడ కూడా వివాదాలకు చెక్ పడలేదు. డిపో నాయకత్వంలో ఉన్న వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తూ అసలైన కార్మికులకు అన్యాయం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కానీ గత సంవత్సరం జరిగిన ఎన్నికల నేపథ్యంలో డిపోలోనూ సమీకరణలు మారాయి. డిపోలోని కార్మికులు సొసైటి బాధ్యులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు మారడంతో మూడో డిపోలో సొసైటీ, గీతకార్మికులు కొట్లాడితే నష్టపోతారని భావించి చర్చలకు దిగారు.
కొందరు అధికార పార్టి పెద్ధలు కుడా తమలో తాము కలహించుకోకుండా సర్దుబాటు చేసుకోవాలని అప్పుడే మనుగడ అని సూచించడంతో చర్చలు అనివార్యమైనట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మూడో డిపోలో పెత్తనం, పంపకాల వివాదం ఓ కొలక్కి వచ్చినట్లైంది. 2016లో రిజస్ర్టేషన్ చేయగా, 2017 నుంచి కల్లు తయారీ, విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే నిజామాబాద్ లో ఉన్న 1,2 సొసైటీలకు ధీటుగా కల్లు అమ్మకాలు సాగిస్తూ గీత కార్మికుల సంఖ్య ప్రకారం బట్టీలను పంచుకున్నారు. మొత్తం గీత కార్మికులు 59 మంది కాగా, ఇద్ధరు సభ్యులు చనిపోవడం, ఇద్ధరు విదేశాల్లో ఉండటంతో మిగిలిన వారిని పంచుకున్నారు. అందులో భాగంగా మెజార్టీ సభ్యులు ఉన్న మొన్నటి వరకు కోట్లాడిన గ్రూప్ నకు 11, పాత వారికి 8 బట్టీలను పంచుకున్నారు. వారు డిపోలో కల్లును సేకరించి బట్టీల్లో విక్రయించుకునేలా అంగీకరించినట్లు తెలిసింది.
