. . . ఇద్దరు ఎల్ ఈటి ఉగ్రవాదులు హతం!
వెబ్ డెస్క్, బతుకమ్మ :
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భద్రతా దళాలు కీలక విజయం సాధించాయి. సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (ఎల్ఈటి)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గత వారం స్థానిక సీఆర్‌పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు నిఘా వర్గాల ద్వారా పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆదివారం నుంచే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో, జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు నేలకొరిగారు. ఘటనా స్థలంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. హతమైన రెండో ఉగ్రవాది ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
