. . . కేంద్ర ప్రభుత్వ సంస్మరణ జ్ఞాపికను కుటుంబ సభ్యులకు అందజేసిన డీపీఈవో
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
విధి నిర్వహణలో అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రాణాలర్పించిన దివంగత ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య త్యాగాన్ని స్మరిస్తూ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ (ఎన్ఫోర్స్ మెంట్) డైరెక్టర్ ఆదేశాల మేరకు స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్మారక జ్ఞాపికను (గౌరవ పురస్కారం) నిజామాబాద్ డీపీఈవో కార్యాలయంలో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శాఖాపరంగా ఘనంగా అందజేశారు. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ అధ్యక్షతన సోమవారం జరిగిన సంస్మరణ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది యూనిఫాంలో హాజరై సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీపీఈవో కె.జి.నందగోపాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో కుమారి గాజుల సౌమ్య కనబరిచిన తెగువ,త్యాగం శాఖలోని ప్రతి ఒక్కరికీ నిరంతరం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జిల్లా పరిధిలో ఎక్సైజ్ నేరాలను మూలాల నుంచి సమూలంగా నిర్మూలించడానికి అధికారులు, సిబ్బంది పూర్తి అంకితభావంతో పనిచేయడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. అమరురాలైన సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వం అన్ని వేళలా సంపూర్ణ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి సత్వర తోడ్పాటు అందించినందుకు గాను ముఖ్యమంత్రికి, ఎక్సైజ్ శాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ/ఎక్సైజ్),ఎక్సైజ్ కమిషనర్ కి, జిల్లా కలెక్టర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నర్సయ్య, నిజామాబాద్ ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, ఎస్ హెచ్ఓ సరిత, బోధన్ ఎస్ హెచ్ ఓ భాస్కర్ రావు, భీమ్గల్ ఎస్హెచ్ఓ చంద్రమోహన్, నిజామాబాద్ ఎస్సై సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే హెచ్సీ ఈసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, జోనల్ అధ్యక్షుడు పవార్ కైలాష్, జిల్లా అధ్యక్షుడు సునీల్ కుమార్, టీఎన్జీవోస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, ఇతర కానిస్టేబుల్ యూనియన్ నాయకులు, కార్యాలయ సూపరింటెండెంట్, మినిస్టీరియల్ సిబ్బంది, జిల్లా ఎగ్జిక్యూటివ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

