. . . తమ్ముడి భార్యను ఆమె రెండేళ్ల కొడుకును భార్యతో కలిసి హత్య చేసిన బావ
. . తమ్ముడి ఆస్తిపై కన్నేసి కడతేర్చిన వైనం
. . . 49 పేజీల తీర్పు వెలువరించిన నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ
. . . పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
సొంత మరదలు ఆమె రెండు సంవత్సరాల కుమారుడిని గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేసిన దాసరి రాజశేఖర్ కు ఆయన భార్య దాసరి నాగలక్ష్మీ కి జీవిత కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన దాసరి రాజశేఖర్, దాసరి రాజబాబు అన్నదమ్ములు వీరికి స్థిర చర ఆస్తులు ఉన్నాయి. చిన్నవాడైన రాజబాబుకు భార్య పిల్లలు ఉన్నారు. ఇతనికి మతిస్థిమితం సరిగా లేనందున ఏమి తెలియకుండా ఉండేవాడు. తమ్ముని మానసిక పరిస్థితిని చూసిన అన్న రాజశేఖర్ తమ్మునికి దక్కాలల్సిన ఆస్తిపాస్థులను కాజేయాలని దురాలోచన చేసి తమ్ముడి భార్య లత ను ఆమె రెండేళ్ల చిన్న కుమారుడు హర్షవర్ధన్ ను చంపివేసి ఆస్తినంత కాజేయాలని పథకం వేసి 2022 ఆగస్టు 2న అర్ధరాత్రి సమయం దాటిన తరువాత తమ్ముని గుడిసె లోకి వెళ్లాడు. రాజశేఖర్ అతని భార్య నాగలక్ష్మీ ఇద్దరు లత ను ఆమె కుమారుడు హర్షవర్ధన్ ల గొంతు చుట్టు నైలాన్ తాడు బిగ్గరగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఇద్దరి శవాలను తన టాటా ఇండిక కారులో మోర్తాడ్ మండల గాండ్లపేట్ గ్రామ శివారు దగ్గర జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తుమ్మ చెట్లలో పడవేశారు. లత తండ్రి గండయ్య పిర్యాదుతో ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించిన మోర్తాడ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి ముత్యంరాజు తదనంతర నేర విచారణకై భీంగల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లుకు అప్పగించారు.నేర విచారణలో భాగంగా నవీపేట్ నుండి జానకం పేట్ అంకపూర్, ఆర్మూర్,మోర్తాడ్ లలో గల సీసీటీవీ పూటేజీలు పరిశీలించి అందులో కారు కదలికలను గుర్తించి అవి రాజశేఖర్ ఉపయోంచిన కారువేనని తెలుసుకుని పరారీలో ఉన్న భార్యభర్తలను కొన్ని రోజులలోనే అదుపులోకి తీసుకుని సాక్షుల ముందు వారి నేరాంగీకారాన్ని నమోదు చేశారు.అన్నదమ్ములకు సంబందించిన నవీపేట్, నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ,గంగాస్తాన్ లో గల ప్లాట్స్ కాగితాలను సంబందిత అధికారుల నుంచి సేకరించి నిజామాబాద్ నగరంలో ఉన్న ప్లాట్ తన తమ్మునికి తెలవకుండా అమ్మగా వచ్చిన అరవై ఆరు లక్షల రూపాయలు విషయాలు, హత్యల అనంతరం రాజశేఖర్ ఫోన్లో డిలీట్ చేసిన వాట్స్ అఫ్ చాట్ ను జియో, ఎయిర్ టెల్, వోడాపోన్ అధికారుల నుంచి సేకరించి పూర్తి డాక్యుమెంట్ జత చేసి 31 మంది సాక్షులతో కూడిన చార్జీషీట్ ను కోర్టులో ధాఖలు చేశారు.హత్యలలో ప్రధాన ముద్దాయిగా రాజశేఖర్ రెండవ ముద్దాయిగా ఆయన భార్య నాగలక్ష్మీ, మూడవ ముద్దాయిగా వనం సాయిబాబా నాల్గవ, ఐదవ ముద్దాయిలుగా రాజశేఖర్ వరుసకు మామ అయిన కోయ గంగాధర్ అత్త కోయ నాగమణి లను పేర్కొన్నారు. హత్యలకు మిగతా ముద్దాయిలు సంహరించి ప్రోత్సహించారని అభియోగాలు మోపారు.నేర న్యాయ విచారణలో భాగంగా చార్జీషీట్ అనుసారం 30మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ కోర్టు, 59ధ్రువీకరించుకున్న పత్రాలు, 14వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకుని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ కౌన్సిల్ ల వాదనలు విన్నది. లత, హర్షవర్ధన్ లను హత్య చేసింది సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేసింది రాజశేఖర్, నాగలక్ష్మీ లేనని సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో నిర్దారించారు. హత్య నేరంకుగాను జీవిత కారాగార శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు. సాక్ష్యాలను రూపుమాపడానికి ప్రయత్నాలు చేసినందున మరో ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు ప్రకటించారు. మిగతా ముద్దాయిలు సాయిబాబా, గంగాధర్,నాగమణి లకు హత్యలో ప్రమేయం లేనందున నిర్దోషులుగా విడుదల చేశారు.
