. . . ప్రతి నెల 5వ తేదిలోపు వేతనాలు ఇవ్వాలి
. . . గ్రూపుల నుంచి కాకుండా కార్పొరేషనే వేతనాలివ్వాలని నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పరేషన్ ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు ప్రతి నెల 5 వ తేదీ లోపు ఇవ్వాలని, ఎస్ డబ్ల్యూజీ గ్రూపులు కాకుండా కార్పొరేషనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెరుపు ఆందోళన చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించకపోవడంతో మంగళవారం కార్పొరేషన్ ఎదుట తెలంగాణ జేఏసీ కమిటీ, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ద్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ కార్మికులు, వీధి లైట్ల ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహిస్తున్నవందల మంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో కార్పొరేషన్ లో పారిశుద్ద్య పనులు, నీటి సరఫరా, వీధి లైట్ల పై ప్రభావం పడింది. కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులు మినహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో జరిగిన నష్టంపై నివారణ చర్యలకు సిద్దమైంది. కార్పొరేషన్ ఉద్యోగులు ధర్నాచౌక్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ. ప్రధానంగా పారిశుద్ద్య, వాటర్ వర్క్, స్ట్రీట్ లైట్, విధి నిర్వహణ కోసం నియామకాలు లేక రెండు దశాబ్ధాలు గడిచింది. రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక నియామకాలే జరిగాయి. ప్రధానంగా పారిశుద్ద్య విభాగంలో నియామకాలు లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే చెత్త సేకరణ, రోడ్ల ఊడ్చడం, డ్రైనేజీలు తీయడం, డంపింగ్ యార్డుకు చెత్తంతరలింపు అంతా పారిశుద్ద్య కార్మికులతోనే నడుస్తోంది. వారికి చాలిచాలని వేతనాలు ఇస్తూ ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలున్నాయి. వారికి ప్రతీనెల 5లోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా 20 తారీఖు వచ్చినా వేతనాలు లేకపోవడంతో పారిశుద్ద్య కార్మికులు అప్పుల పాలై ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అదీచాలదన్నట్లు బల్ధియాలో విధి నిర్వహణ పారదర్శకత్వం, హాజరుకోసమని తెచ్చిన ఏడుగురు ఉద్యోగులకు ఒక గ్రూప్ అన్నది కార్మికులకు వేతన కష్టాలను తెచ్చి పెట్టింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కాకుండా గ్రూపుల ద్వారా వేతనాలు చెల్లిస్తామని చేపట్టిన కార్యక్రమం వికటించింది. అందులో గ్రూపుల రిజిస్ట్రేషన్ జరుగక వేతనాలు రాకపోవడంతో బల్ధియా కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికి కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకు దిగిన వారికి స్పష్టమైన హామీ దక్కకపోవడంతో నిరసనల కొనసాగింపు జరుగుతుందా? లేక నిలిచిపోతుందా ? అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి.
. . . కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు
నిజామాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మద్దతు తెలిపారు. ధర్నాచౌక్ లో ఆందోళనకారులను కలిసి బీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ హయంలో పారిశుద్ద్య కార్మికుల నియామకాలు జరిగాయని, వారికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రతి నెల 5లోపు వేతనాలు చెల్లించడం జరిగిందని గుర్తు చేశారు. కార్పేరేషన్ ఉద్యోగులకు కనీసం 5లోపు వేతనాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని అన్నారు. వేతనాలు చెల్లించలేని పరిస్థితిలోనే ఎస్ డబ్ల్యూజీ గ్రూపుల పేరిట బల్ధియా అధికారులు నాటకం ఆడుతున్నారన్నారు. కార్పేరేషనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించే వరకు వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించారు.

