. . .కల్లెడి గ్రామ పంచాయితీకి తాళం
. . . ప్రజాప్రతినిధుల మధ్య ముదిరిన పంచాయితీ
నిజామాబాద్, బతుకమ్మ :
పంచాయితీలలో చెక్ పవర్ విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లకు మాత్రమే అధికారం ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయితీ కార్యదర్శులకు కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎందుకంటే సర్పంచ్, ఉప సర్పంచ్ లు కూడబలుకుని నిధులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయం ఉంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్ పేట్ పంచాయితీలో సర్పంచ్ తీరుపై ఏకంగా పాలకవర్గం తిరుగుబాటు చేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై పంచాయితీలోనే సర్పంచ్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన విషయం తెల్సిందే.
నిజామాబాద్ జిల్లా అలూర్ మండలం కల్లెడి స్థానిక గ్రామ సచివాలయంకు శనివారం గ్రామ పంచాయితీ కార్మికులు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రజాప్రతినిధుల మధ్య నిధుల దుర్వినియోగం వివాదం తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందని ప్రథమ పౌరురాలిపై పాలకవర్గం ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దానిపై గ్రామ మొదటి పౌరురాలు భర్త ప్రత్యరోపణలు ప్రత్యర్థులపై చేస్తున్నారు. నిధుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దానిని జీర్ణించుకోలేని పాలకవర్గ ప్రథములు ఏకంగా పంచాయితీ పారిశుద్ద్య కార్మికులతో గ్రామ సచివాలయానికి తాళం వేయించడం చర్చకు దారితీసింది. నిధుల దుర్వినియోగంపై సమాధానం చెప్పాల్సింది పోయి, లేనిపోని అపవాదులు వేస్తున్నారని గ్రామ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి పనుల చెక్కులపై, తీర్మానాలపై సంతకాలు పెట్టడం లేదని, కావాలనే పనులను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేయడంపై మండిపడుతున్నారు. ప్రజల పక్షాన నిలబడి నిధుల జవాబుదారీతనం అడిగితే, తప్పుడు ఆరోపణలతో బద్నాం చేయడానికి ప్రజాప్రతినిధి భర్త ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం, అభివృద్ధి పనులలో విచ్చల విడిగా బిల్లులు రాసుకొని అందిన కాడికి దోచుకుందామని ఒకరిపై ఒకరు తప్పుడు ఆరోపణలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాదనలు తెరపైకి వస్తున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి ఎంజిఎన్ ఆర్ ఎస్ కూలీల కోసం ప్రతి రోజున నీటిని అందిస్తున్నారని దానికి సంబంధించిన బిల్లులు ఫిబ్రవరి నెలలో ఏకంగా 31 రోజులు నీటిని అందించామని తమ రికార్డులో చూపించి మరి వాటర్ బిల్లులు రాయడం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నెలను మార్చేయడం పై గ్రామంలో సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి బిల్లు మరెన్నో ఉన్నాయి. జిల్లా స్థాయి ఉన్నట్టుగా అధికారులు స్పందించి రికార్డులను తనిఖీ చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
. . . గ్రామంలో నిలిచిన పాలన అధికారుల జోక్యం అవసరం : వార్డు మెంబర్ మహేష్
గ్రామ పంచాయితీలో చెక్ పవర్ కలిగిన ప్రజాప్రతినిధుల వర్గపోరు కారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయం మూతపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు, ఇతర అత్యవసర పనుల కోసం వచ్చే గ్రామస్థులు కార్యాలయం చుట్టూ తిరిగి వెనుదిరుగుతున్నారు. సఫాయి కార్మికులను రాజకీయాల్లోకి లాగి పంచాయతీకి తాళం వేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

