28.2 C
Hyderabad

మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశ సమైక్యతను కాపాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ-కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉత్తమ ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు, డాక్టర్ సవితారాణి పాల్గొన్నారు. వారు జాతీయ జెండాను ఆవిష్కరించగా, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ.. వందల ఏళ్లపాటు బానిస సంకెళ్లలో మగ్గిన భారత ప్రజలు స్వాతంత్య్రం కోసం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. “స్వాతంత్య్రం నా జన్మహక్కు” వంటి నినాదాలతో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. శాంతి, అహింసతో పాటు సాయుధ, విప్లవ ఉద్యమాల ద్వారా స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపించగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు సైతం బ్రిటిష్ వారికి ఎదురొడ్డి వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని బాలలు, యువత, పెద్దలు ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత, సమగ్రత కోసం బాధ్యతగా పనిచేయాలని దాసరి విజయానందరావు సూచించారు. ప్రపంచ నలుమూలలా భారతదేశ గొప్పతనాన్ని చాటేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మానసిక దివ్యాంగులు, అంధ విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కోశాధికారి తాటి సుధాకర్, జాయింట్ సెక్రెటరీ షేర్ల దయానంద్, వర్గ సభ్యులు రమణారెడ్డి, లోకల్ కమిటీ చైర్మన్ బాబా గౌడ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిరంజన్ ప్రసాద్, దాత వేదవతి కులకర్ణి, స్నేహ సొసైటీ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

We must safeguard the country's unity, inspired by the sacrifices of great leaders.

More articles

Latest article