28.2 C
Hyderabad

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ మళ్లీ పట్టాలెక్కుతుంది

 

. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. భాషలు, సంస్కృతులు వేరైనా భారతీయత అనే భావన దేశ ప్రజలందరినీ కలిపి ముందుకు నడిపిస్తోందన్నారు. స్వాతంత్య్రం సాధించిన అనంతరం దేశం అభివృద్ధి చెందాలని సమరయోధులు ఆశించారని, అయితే ఎనిమిది దశాబ్దాలు గడిచినా వారు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ఇంకా అనేక గ్రామాలకు రోడ్లు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందకపోవడం బాధాకరమన్నారు. సాగునీటి సమస్యతో రైతులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. చైనా గత నాలుగు దశాబ్దాల్లో సాధించిన అభివృద్ధిని మన కళ్లముందే చూస్తున్నామని, భారతదేశానికి చైనా కంటే ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నామని కేటీఆర్ అన్నారు. దేశాన్ని పరిపాలించే వారికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. బలహీనమైన దేశాలతో పోల్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా పాలన సాగాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై ఎంతమేరకు చిత్తశుద్ధి ఉంటుందని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి వంటి అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉండేవని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సింగిల్ ఇంజన్‌తోనే వేగంగా అభివృద్ధి చెందిందని, కేంద్రం చెబుతున్న డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకంటే రాష్ట్రం అనేక రంగాల్లో ముందంజలో ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాని విధానాలపై విమర్శలు చేసిన కేటీఆర్.. తెలంగాణ దివాళా తీసిందంటూ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలని, రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ త్వరలో జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్.. కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన జలదృశ్యం నుంచే పార్టీ ప్రయాణం ప్రారంభమైందన్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్ కార్యాలయానికి భవనాలు అద్దెకు ఇవ్వడానికి కూడా కొందరు భయపడేవారని తెలిపారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి 20 ఏళ్లు పూర్తయ్యాయని, తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచన మేరకు ఈ భవనం నిర్మించబడిందన్నారు. తెలంగాణ భవన్ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. భవన నిర్మాణంలో శ్రమించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

BRS will come to power.

More articles

Latest article