. . . సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి నగర కార్యదర్శి నీలం సాయి బాబా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ పరిధిలో ఉన్న లలితానగర్ వాసుల విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లలితానగర్‌కు సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయి బాబా అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ టీఎస్ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రాజేశ్వరరావుకు శుక్రవారం సీపీఐ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నీలం సాయిబాబా, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శివకుమార్ మాట్లాడుతూ లలితానగర్‌లో సుమారు 50 నుంచి 100 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సిరిపూర్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతున్నందున తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. సిరిపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వ్యవసాయ అవసరాల కోసం అదే సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో లలితానగర్‌లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా రాత్రివేళ కరెంటు పోతే తిరిగి ఉదయం వరకు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో పిల్లలు రాత్రిళ్లు సరిగా నిద్రపోలేకపోతున్నారని, ఫ్యాన్లు పనిచేయక దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నాయకులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగా లేకపోవడంతో రాత్రివేళల్లో చీకటిలో ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఉందన్నారు. వైద్య ఖర్చుల రూపంలో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. లలితానగర్‌కు సమీపంలోని రోటరీనగర్, అయోధ్యనగర్, ఇంద్రాపూర్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్ నగరం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోందని, అదే విధంగా లలితానగర్‌కు కూడా నగర సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయాలను నివారించి ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాల్సిన బాధ్యత విద్యుత్ సంస్థ అధికారులపై ఉందన్నారు. లలితానగర్ ప్రజల విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నగర నాయకులు గొంట్యాల రమేష్, ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, నగర అధ్యక్షులు తాంపే రాజు, లలితానగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు సుదర్శన్, వర్మ, జనార్ధన్, ఐఎఫ్టీయూ నాయకులు శంకర్, జె. రమేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
