. . . తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోకుండానే గత మూడు నెలలుగా పెన్షనర్ల నుంచి 1.5 శాతం చొప్పున పెన్షన్‌లో కోత విధించడాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. బుధవారం నిజామాబాద్‌లోని పెన్షనర్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి గత మూడు నెలల్లో సుమారు రూ.250 కోట్లను వసూలు చేసినప్పటికీ ఇప్పటివరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సంఘం గౌరవాధ్యక్షుడు కే. రామ్మోహన్రావు ఆరోపించారు. గత ఆరు నెలలుగా హెల్త్ కార్డులు ఇస్తామంటూ పెన్షనర్లను తిప్పుతున్నారే తప్ప, ఇప్పటివరకు కార్డులు జారీ చేయలేదని జిల్లా అధ్యక్షుడు శిర్ప హనుమాన్లు విమర్శించారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపానెల్డ్ ఆసుపత్రుల అంగీకారం పొంది, హెల్త్ కార్డులు జారీ చేసే వరకు పెన్షన్‌లో 1.5 శాతం కోత విధించే ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ప్రసాదరావు, పురుషోత్తంరావు, చంద్రశేఖర్, రాజేశ్వర్, సాంబశివరావు, లంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
