25.9 C
Hyderabad

అవసరాల ఆధారిత కనీస వేతనాన్ని నిర్ణయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్మికుల వాస్తవ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాల ఆధారిత కనీస వేతనాలను నిర్ణయించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 20న నిర్వహించనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. టియుసిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస వేతనాల సమస్య దేశంలోని ప్రతి కార్మికుడిని ప్రభావితం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేస్తున్న చట్టబద్ధమైన కనీస వేతనాలు కార్మికులు, వారి కుటుంబాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. దీంతో లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన కనీస వేతనం నిజమైన అవసరాల ఆధారంగా ఉండాలని టియుసిఐ డిమాండ్ చేస్తోందన్నారు. 1957లో జరిగిన 15వ భారత కార్మిక సదస్సు (ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్) నిర్దేశించిన శాస్త్రీయ ప్రమాణాలకు, 1992లో సుప్రీంకోర్టు గుర్తించిన సూత్రాలకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించాలని కోరారు. ఒక కార్మికుడు, అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లల కుటుంబానికి అవసరమైన ఆహారం, దుస్తులు, పిల్లల విద్య, వైద్యం, వినోదం, పండుగల ఖర్చులతో పాటు వృద్ధ తల్లిదండ్రుల పోషణకు అవసరమైన వ్యయాలను భరించగలిగే స్థాయిలో కనీస వేతనం ఉండాలని సూర్యం అన్నారు. మే 2026లో ఉన్న రిటైల్ ధరలను ప్రాతిపదికగా తీసుకుని చట్టబద్ధమైన కనీస వేతనాన్ని నెలకు రూ.39,373 గా నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. వెంకన్న, డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. కిషన్, జిల్లా నాయకులు బి. మురళి, డి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article