. . . భక్తులకు అధిక ధరలకు గదుల విక్రయం
. . . ఆరుగురు అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి తిరుమలలో తక్కువ ధరలకు గదులు పొంది, వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠాను తిరుమల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ, బిహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఇరప్ప కాలప్ప, శ్రీనివాస్, బిహార్‌కు చెందిన అముల్ కుమార్ సింగ్, కర్ణాటకకు చెందిన ప్రకాష్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సందీప్, విష్ణువర్ధన్ కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇతరుల ఆధార్ కార్డుల్లో ఫొటోలు, పేర్లు, నంబర్లను మార్చి వాటిని గదుల బుకింగ్‌కు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో సామాన్య భక్తులకు గదులు కేటాయించే సీఆర్వో కార్యాలయంలో రూ.50, రూ.100, రూ.1,000 అద్దెతో లభించే గదులను నకిలీ ఆధార్ కార్డుల ద్వారా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గదుల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. ఈ గదుల దందాను నిర్వహించేందుకు తిరుమలలోని హోటళ్లలో పనిచేసే కార్మికులు, వీధుల్లో వ్యాపారం చేసే హాకర్లను కూడా ముఠా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్మికులు, హాకర్లను సీఆర్వో కార్యాలయంలోని క్యూలో నిలబెట్టి గది అద్దెను ముఠా సభ్యులే చెల్లించేవారు. గది తీసుకున్న అనంతరం వారికి రూ.200 నుంచి రూ.500 వరకు కమీషన్ చెల్లించి గది తాళాలు తీసుకునేవారు. ఆ గదులను అవసరం ఉన్న భక్తులకు 12 గంటల కాలానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు. 12 గంటల సమయం పూర్తయిన తర్వాత అదే గదిని మరో భక్తుడికి కేటాయిస్తూ రొటేషన్ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన తిరుమల టూటౌన్ పోలీసులు శనివారం ఉదయం సీఆర్వో కార్యాలయం వద్ద ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గదుల అక్రమ విక్రయానికి సంబంధించి మరింత మందికి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
