28.1 C
Hyderabad

పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్ల మంజూరు

 

. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తనను తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ నిరూపించారు. తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పాత భవనాన్ని కూల్చి ఆధునిక వసతులతో నూతన పాఠశాలగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఆయన పాఠశాలను సందర్శించారు. తాను చదువుకున్న తరగతి గదిలో కొద్దిసేపు కూర్చొని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను అడుగులు వేసిన ప్రాంగణం, విద్యాబుద్ధులు నేర్చుకున్న తరగతి గదులు, తనతో కలిసి చదువుకున్న స్నేహితుల జ్ఞాపకాలు ఆయన కళ్లముందు మెదిలాయి. ఆ సమయంలో ఆయన ముఖంలో కనిపించిన భావోద్వేగం అక్కడున్న పూర్వ విద్యార్థులను సైతం కదిలించింది. తాను చదువుకున్న పాఠశాల తన జీవితానికి పునాది వేసిన ప్రదేశమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఆలోచన ఎప్పటి నుంచో తనలో ఉందన్నారు. నేను చదువుకున్న బడి ఇది. ఈ పాఠశాల నాకు కేవలం ఒక విద్యాలయం కాదు.. నా జీవితానికి పునాది వేసిన ప్రదేశం. ఇక్కడి నుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. అందుకే ఈ బడికి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎప్పటికీ ఉంటుందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. 1971లో తాను విద్యనభ్యసించిన ఈ పాఠశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనతో కలిసి చదువుకున్న మిత్రులను ఏళ్ల తర్వాత అదే పాఠశాల ప్రాంగణంలో కలుసుకోవడం మరపురాని అనుభూతిగా అభివర్ణించారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన షబ్బీర్ అలీ.. పాఠశాల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. పాఠశాల భవన అభివృద్ధితో పాటు విద్యార్థులకు ఆధునిక విద్యా ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, ఇతర ఆధునిక విద్యా సదుపాయాలతో పాఠశాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చోట తన సొంతంగా కూడా ఖర్చు చేస్తూ సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థులతో షబ్బీర్ అలీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తనతో కలిసి చదువుకున్న మిత్రులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలు, పాఠశాలలో గడిపిన రోజులు, అప్పటి ఉపాధ్యాయులు, స్నేహితులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులతో ఆయన సరదాగా ముచ్చటించారు. ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒకే చోట కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణం ఆత్మీయత, ఆనందం, జ్ఞాపకాలతో సందడిగా మారింది.

 

School memories can never be forgotten.

 

బాల్య జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన పాత భవనం త్వరలో కొత్త రూపు సంతరించుకోనుండటంపై ఒకవైపు ఆనందంగా ఉన్నప్పటికీ, ఆ భవనాన్ని వీడాల్సి రావడం కొంత భావోద్వేగానికి గురిచేసిందని షబ్బీర్ అలీ తెలిపారు. భవనం మారుతుంది.. కానీ ఈ బడి నాకు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవని ఆయన పేర్కొన్నారు. ఆయన మాటలు అక్కడున్న పూర్వ విద్యార్థులను సైతం భావోద్వేగానికి గురిచేశాయి. తాను చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా, అదే విద్యాలయ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్న షబ్బీర్ అలీపై పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చదువు నేర్పిన బడికి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో, అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కైలా శ్రీనివాస్, మహమ్మద్ ఇలియాస్, పండ్ల రాజు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

School memories can never be forgotten.

More articles

Latest article