25.5 C
Hyderabad

ఆదివాసీల వాస్తవ జనాభాను గుర్తించి హక్కులు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆదివాసీల వాస్తవ జనాభాను ప్రభుత్వం గుర్తించి, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, ఇతర హక్కులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివాసీ నాయక్‌పోడ్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవితో అనుబంధం, ప్రకృతితో సహజీవనం కొనసాగిస్తూ, జల్–జంగల్–జమీన్‌ను కాపాడుతూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తున్న ఆదివాసీలు ప్రకృతికి నిజమైన రక్షకులని అన్నారు. రాష్ట్రంలో ఆదివాసీల జనాభా సుమారు 6.50 లక్షలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 16 వేల మంది మాత్రమే ఉన్నట్లు చూపించడం బాధాకరమని గాండ్ల రామచందర్ అన్నారు. ఆదివాసీ నాయక్‌పోడ్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కౌన్సెలింగ్‌కు వెళ్లిన సమయంలో అధికారులు రకరకాల ప్రశ్నలు అడుగుతూ, హోల్డింగ్‌లో ఉంచి ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేయడం సరికాదని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని సంబంధిత పదవుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రామచందర్ తెలిపారు. ఈ సమస్యలను త్వరలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రతి జిల్లాలో సుమారు 30 వేల మంది ఆదివాసీలతో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమాలు చేపడతామని గాండ్ల రామచందర్ హెచ్చరించారు. ఆదివాసీ హక్కులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు భోజన్న, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, కోశాధికారి పవన్ కుమార్, అధికార ప్రతినిధి దుర్గా మల్లేష్, ఉద్యోగ సేవా సంఘం కార్యదర్శి గంట గంగాధర్, జిల్లా డీఆర్ డిఎ అధికారి సాయన్న, సేవా సంఘం ఉపాధ్యక్షులు దాత్రి అంజయ్య, డాక్టర్ విజయ్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article