25.5 C
Hyderabad

భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

 

. . . తహసిల్దార్లతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా

 

. . . ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు షోకాజ్ నోటీసులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమీక్ష మందిరంలో శుక్రవారం ఆయన అన్ని మండలాల తహసిల్దార్లతో భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఎన్ని అని ఆరా తీస్తూ, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీ.ఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వెంటదివెంట ఆర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. పై అంశాలకు సంబంధించి నిర్ణీత నమూనాలో రోజువారీగా తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని ఈ నెల 17వ తేదీ లోపు అన్ని ఎఫ్.ఆర్.సి దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్ మిల్లులను ప్రతి పక్షం రోజులకు ఒకసారి అయిన తప్పనిసరిగా సందర్శిస్తూ, ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహసిల్దార్లను ఆదేశించారు. నూతన తహసిల్దార్ కార్యాలయాల నిర్మాణాల కోసం ఆయా మండలాలలో అవసరమైన స్థలాలను గుర్తిస్తూ, సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు.

 

Applications related to 'Bhu-Bharathi' and 'Sadabainama' must be resolved promptly.

 

. . . ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ

ఇదిలాఉండగా, సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన తహసిల్దార్లకు కలెక్టర్ భవేష్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహసిల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం అనంతరం మరో 15 నిమిషాల వరకు కూడా సమావేశం హాల్ కు చేరుకోలేకపోయిన తహసిల్దర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, ఆయా మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

 

Applications related to 'Bhu-Bharathi' and 'Sadabainama' must be resolved promptly.

More articles

Latest article