. . . కేరళలో ప్రధాన నిందితుడు అరెస్ట్
. . . 35 వాహనాలు స్వాధీనం
వెబ్ డెస్క్, బతుకమ్మ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు భరత్ కుమార్‌ను పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం చేపట్టిన ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి వద్ద నుంచి 6 బస్సులు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ వాహనాలన్నీ మోసపూరితంగా సంపాదించిన నిధులతో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ప్రకారం, భరత్ కుమార్ భద్రాచలం ఐటీసీ కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడైంది. అలాగే “బీకే నాయుడు అండ్ కో”, “రాజేశ్వరి ట్రావెల్స్” పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు బరపాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా నిందితుడి ఆచూకీని కేరళలో గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే నకిలీ పెట్టుబడి పథకాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద స్కీములపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పోలీసులు కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

