. . . ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రియన్ష్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో జరిగిన ఘటనపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రియన్ష్ కాలేజ్ ఘటనలో కేసులు నమోదు చేసే ముందు పోలీసులు సంబంధిత సీసీటీవీ ఫుటేజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఘురాం అన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఏకపక్ష సమాచారాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో ఏఐఎస్ఎఫ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎఫ్ఐఆర్ లో సంఘం పేరును చేర్చి బెదిరింపులు, భౌతిక దాడులకు సంబంధించిన ఆరోపణలు నమోదు చేయడం పూర్తిగా అవాస్తవమని, ఇది అన్యాయమని రఘురాం అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్న జాతీయ విద్యార్థి సంఘాలపై తప్పుడు సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. రియన్ష్ కాలేజ్ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించి అసలు వాస్తవాలను బయటకు తీసుకురావాలని ప్రభుత్వం, పోలీసు శాఖను ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సంఘానికి ఎలాంటి సంబంధం లేకున్నా ఎఫ్ఐఆర్ లో ఏఐఎస్ఎఫ్ పేరును చేర్చడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని, దీనిపై రియన్ష్ కాలేజ్ యాజమాన్యం వెంటనే ఏఐఎస్ఎఫ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. అలా చేయని పక్షంలో కాలేజీ యాజమాన్యంపై పరువు నష్టం దావాతో పాటు అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రఘురాం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ ఘటనకు సంబంధించిన కేసుల విషయంలో తీసుకున్న వైఖరిని ప్రస్తావిస్తూ, నిజామాబాద్ రియన్ష్ కాలేజ్ ఘటనలో విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలపై తప్పుడు కేసులు నమోదు చేసే ధోరణిని వెంటనే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, జిల్లా కోశాధికారి అనూష, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ తదితరులు పాల్గొన్నారు.
