. . . ఇందూరు జిల్లాలో 3.25 లక్షల సంతకాల సేకరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గో సన్మాన ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇందూరు జిల్లాలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది హిందువుల సంతకాలు సేకరించే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోని 790 జిల్లాల్లో రెండో విడతగా 15 కోట్ల సంతకాల సేకరణ లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇందూరు జిల్లా నుంచి 3 లక్షల 25 వేల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఉన్న గణేష్ మందిర్ నుంచి ఉదయం 10 గంటలకు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయ మహా మంత్ర జపంతో సుమారు 100 మంది కార్యకర్తలు, గోసేవకులు కలిసి గోసమ్మాన్ యాత్రను ప్రారంభించారు. యాత్ర కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం సేకరించిన సంతకాల ప్రతులను ఇన్‌చార్జి కలెక్టర్ కు అందజేశారు. ఈ సంతకాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, తెలంగాణ ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు చేరవేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ను కోరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గో సన్మాన ఆహ్వాన అభియాన్ ప్రతినిధి ఎల్. రాజు, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పి) జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, వీహెచ్ పీ గోరక్ష విభాగ్ ప్రముఖ్ దాత్రిక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్, ఆర్య సమాజ్ జిల్లా అధ్యక్షుడు మహాంకాళి విజయకుమార్ ఆర్య, కార్యదర్శి తిరుమల శ్రీనివాస్ ఆర్య, హిందూ జనజాగృతి సమితి రెండు రాష్ట్రాల సమన్వయకర్త చేతన్ గాడే, ఇందూరు గో సేవా సమితి ప్రతినిధి విరామల్లు రమేష్, యోగా ఉపాధ్యాయుడు సిద్ధి రాములు, చిన్నపూర్ గోశాల నిర్వాహకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మార్వాడీ సమాజ్‌కు చెందిన శతర్ సింగ్ రాజ్ పురోహిత్, రాజస్థానీ విష్ణు సమాజ్ సభ్యులు, పలువురు గోసేవకులు, గోరక్షకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

