నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈషా గ్రామోత్సవ క్రీడా పోటీల్లో కమ్మరిపల్లి వాలీబాల్ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. జూలై 25న కలెక్టర్ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ క్రీడా వేడుకల్లో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతికూల వాతావరణం, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆటను కొనసాగిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. వాలీబాల్ విభాగంలో కమ్మరిపల్లి జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు డీవైఎస్ఓ పవన్ కుమార్, వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశం చేతుల మీదుగా రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు. విజేత జట్టు సభ్యులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ వాలీబాల్ బ్లాక్ హాక్స్ జట్టు వారికి ప్రత్యేక జెర్సీలను స్పాన్సర్ చేసింది. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తదుపరి దశలో డివిజనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ఆగస్టు 9న కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. అనంతరం ఈషా కోయంబత్తూర్‌లోని ఆదియోగి సన్నిధిలో సెప్టెంబర్ 6, 2026న ఫైనల్స్ జరగనున్నాయి. ఫైనల్స్‌లో విజేతలకు రూ.5 లక్షల భారీ బహుమతిని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈషా ఫౌండేషన్ నిజామాబాద్ ఇన్‌చార్జ్ కిషోర్ రాథోడ్ ఆధ్వర్యంలో గ్రామోత్సవ క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
