. . . కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
వెబ్ డెస్క్, బతుకమ్మ :
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్ష రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నీట్ అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతమవడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.
. . . నిందితులపై కేంద్రం కఠిన చర్యలు
ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారులు, సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

