25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నారాయణ కళాశాలలను సీజ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ గుర్తింపు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్నట్లు ఆరోపణలు ఉన్న నారాయణ విద్యాసంస్థల కళాశాల భవనాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి), తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎస్ఎఫ్) జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ) రవి కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నగర అధ్యక్షుడు సుభాష్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మహేష్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేశాపూర్ వద్ద ఉన్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాల విద్యాశాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా ఒక ప్రైవేట్ భవనంలో నిర్వహించబడుతోందని ఆరోపించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల షిఫ్టింగ్‌కు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై వెంటనే సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు. అదే విధంగా సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న నారాయణ కళాశాల కూడా అవసరమైన అనుమతులు లేకుండానే నడుస్తోందని ఆరోపిస్తూ, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే సంబంధిత కళాశాల భవనాలను సీజ్ చేసి, యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు సతీష్, సురజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article