30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చలో అంకాపూర్ ఉద్రిక్తం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత 

 

. . . బీజేపీ ఎమ్మెల్యేల హౌజ్ అరెస్టులు

 

. . . అంకాపూర్ లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఆర్మూర్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సోమవారం చలో అంకాపూర్ పిలుపునివ్వడంతో తాము సైతం బలం ప్రదర్శిస్తామని బీజేపీ నాయకులు పేర్కొనడంతో రెండు రోజులుగా ఆర్మూర్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంకాపూర్ లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పలువురు కాంగ్రెస్ నాయకులు యత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని, ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డిలను ముందస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు.ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని  కాంగ్రెస్ పిలుపుతో పోలీసులు అంకాపూర్ ను చుట్టుముట్టారు. అన్ని దారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంకాపూర్ కు వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదేశాల మేరకు బీఎన్ఎస్ 163 అమల్లో ఉన్నందున పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అంకాపూర్ లోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా అంకాపూర్ కు బయలుదేరగా ఆయనను 1వ టౌన్ పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

 

Tension prevails at 'Chalo Ankapur'

 

అంకాపూర్ లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆ పార్టీ నేతల మెడలోని బంగారు గొలుసులను లాక్కోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మహిళలకు తాను అండగా ఉంటానని, మహిళలు ధైర్యంగా ఆ బంగారు గొలుసులను అమ్మేసి తనకు రశీదు పెట్టాలని అన్నారు. స్కూటీలు ఇస్తామని సైతం హామీ ఇచ్చి కాంగ్రెస పార్టీ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకుల షోరూంలలో నుంచి స్కూటీలు సైతం ఎత్తుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి రాకేష్ రెడ్డికి మద్దతుగా అంకాపూర్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చకు రాకేష్ రెడ్డి సిద్దంగా ఉన్నారని పోలీసులు ఆయనను హౌజ్ అరెస్టు చేయడం తగదన్నారు. ఆర్మూర్, ఇందూర్ అభివృద్ది ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు తరుచూ సవాళ్ళు విసరడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. వినయ్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేయడంతో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలోనే సర్పంచ్ స్థానాన్ని గెలిపించుకోలేని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాళ్ళు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 15న నిజామాబాద్ నగరంలో బీజేపీ రణభేరీలో కాంగ్రెస్ పార్టీపై పైడి  రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలే చలో అంకాపూర్ పిలుపునకు దారి తీసిందన్నారు. పీసీసీ చీఫ్ ను రాజీనామా చేసి పోటీ చేయాలని పిలిచే అవసరం లేదని ఇక్కడ పోటీకి తాను సిద్దంగా ఉన్నానని వినయ్ రెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 86 గ్రామ పంచాయితీలకు బీజేపీ 11 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 66 స్థానాల్లో విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

 

Tension prevails at 'Chalo Ankapur'

More articles

Latest article